ఏపీ ప్రభుత్వం.. కొత్త ఎక్స్రైజ్ పాలసీ మీద కూడా దృష్టిపెట్టింది. అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీని ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా నూతన మద్యం పాలసీ రూపకల్పనపై కసరత్తు ప్రారంభమైంది. ఏపీ నూతన మద్యం విధానం రూపకల్పన కోసం పొరుగు రాష్ట్రాల పాలసీలను అధ్యయనం చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ముగ్గురు సభ్యుల చొప్పున నాలుగు బృందాలను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నాలుగు బృందాలు తెలంగాణ, కర్ణాటక, కేరళ, యూపీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలలో పర్యటించి అక్కడి మద్యం పాలసీని అధ్యయనం చేయనున్నాయి.
మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానాన్ని.. బార్లు, మద్యం షాపుల్లో ధరలు, చెల్లింపులు విధానం, మద్యం నాణ్యతను ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. అలాగే డీ అడిక్షన్ సెంటర్లను సైతం పరిశీలించనున్నారు. అన్నింటి సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆగస్ట్ 12లోగా ఈ బృందాలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి. వీటిని పరిశీలించిన అనంతరం నూతన మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. అనంతరం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ బ్రాండ్లను, నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. అలాగే చెల్లింపులను కూడా డిజిటల్ పద్ధతిలో చేపట్టలేదని, మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించింది. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం పాలసీ తెస్తామని.. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత బ్రాండ్లను మళ్లీ తీసుకువచ్చారు. అలాగే మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించారు. తాజాగా నూతన మద్యం పాలసీ తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. అన్ని రాష్ట్రాల మద్యం పాలసీలను పరిశీలించిన తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.