విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. 2014-19 హయాంలో తన పాలనలో ప్రారంభించి, ఆ తర్వాత నిలిచిపోయిన పనులు, ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించారు. ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని భావిస్తున్న చంద్రబాబు.. అందులో భాగంగానే రామకృష్ణారెడ్డిని మళ్లీ తీసుకువచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వైజాగ్, విజయవాడలలో మెట్రో రైలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది.
అయితే రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే 2014లో విశాఖపట్రం మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధం చేశారు. రూ.8,300 కోట్ల వ్యయంతో విశాఖలో 42.55 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించారు. ఈ డీపీఆర్‌కు కేంద్రం కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు. టెండర్లు కూడా పిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. అధికారంలోకి వచ్చింది. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, టెండర్లను రద్దు చేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మార్చారు. అలాగే రామకృష్ణారెడ్డిని కూడా మారిటైమ్ బోర్డుకు సీఈవోగా నియమించారు.
అయితే ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో పదవికి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత రాజీనామా చేశారు. ఇక 2024 ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన రామకృష్ణారెడ్డినే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా మరోసారి నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఇక ఇటీవలే విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు.. మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని కీలక సూచనలు చేశారు. ఇక సీఎం సూచనల ఆధారంగా గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే ఫ్లై ఓవర్లకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులు కావటంతో త్వరలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.