రాజధాని అమరావతి రైతులకు మరో ఐదేళ్ల పాటు భూములు ఇచ్చిన కౌలు చెల్లించాలని నిర్ణయించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల నుంచి 30 వేలకు పైగా ఎకరాలను సేకరించారు. భూమి ఇచ్చిన రైతులకు ప్రతి ఎకరాకు ఏటా కౌలు చెల్లిస్తూ వచ్చారు. అయితే పదేళ్ల పాటు కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం, సీఆర్డీఏ నిర్ణయించింది. దీని ప్రకారమే ఇప్పటి వరకూ ప్రతి ఏటా రైతులకు కౌలు డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. అయితే ఆ గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఐదేళ్ల పాటు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతు కూలీలకు పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించారు.
శుక్రవారం సీఆర్డీఏ అధికారులతో సచివాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు కౌలు చెల్లింపుపైనా చర్చించారు. అనంతరం మరో ఐదేళ్ల పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు.ప్రభుత్వం ఏటా ఎంత మొత్తం చెల్లిస్తోందో అంతే మొత్తాన్ని మరో ఐదేళ్లు అందించాలని ఆదేశించారు. ఇక ఈ సమావేశంలోనే చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2015లో ఇచ్చిన 207 జీవో ప్రకారం సీఆర్డీఏ పరిధి 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో నిర్ణయించిన ప్రకారమే సీఆర్డీఏ పరిధి ఉంటుందన్నారు.
మరోవైపు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన నాలుగు గ్రామాలను తిరిగి అమరావతి రాజధాని పరిధిలోని తేవాలని అధికారులకు సూచించారు. అలాగే అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుపైనా అధికారులతో చర్చించారు. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం, కరకట్ట రోడ్డు నిర్మాణం, థీమ్ నగరాల ఏర్పాటు వంటి వాటిపైనా సీఎం చర్చించినట్లు సమాచారం. అలాగే వైసీపీ ప్రభుత్వం హయాంలో చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపైనా సమీక్ష జరుపుతామని చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో గతంలో భూములు కేటాయించిన సంస్థలకు కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి మరో రెండేళ్లు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.