వైసీపీ కార్పొరేటర్లు గురువారం తాడేపల్లిలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ఈనెల ఏడో తేదీన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగనున్న తరుణంలో జగన్‌ను కార్పొరేటర్లు కలవడం చర్చనీయాంశంగా మారింది. జీవీఎంసీలో ఇండిపెండెంట్ కార్పొరేటర్‌తో కలుపుకుని వైసీపీకి 60 మంది కార్పొరేటర్లు ఉండేవారు. వారిలో 12 మంది ఇటీవల టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. మిగిలిన 48 మందిలో 40 మంది కార్పొరేటర్లు రెండు బస్సుల్లో బయలుదేరి తాడేపల్లి వెళ్లారు. మాజీ సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నిక విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఎన్నికలో గెలుపొందాలంటే 49 మంది కార్పొరేటర్ల బలం అవసరమని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధ ర్ , ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావులు వివరించారు. పలువురు కార్పొరేటర్లు పార్టీని వదిలి వెళ్లిపోయిన విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి జగన్ స్పందిస్తూ అధికారం కోల్పోతే ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి అనుభవం ఎదురవ్వడం సహజమని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కూటమి ఇచ్చిన హామీలు అమలుచేయడం సాధ్యం కాదని, ఈ ఐదేళ్లు ప్రజల్లోనే ఉండాలని కార్పొరేటర్లకు సూచించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసిన వారిలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్ ఉన్నారు.