అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భరత్ ఐదేళ్లు అరాచకాలు సృష్టించారని, ఆయన నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం తథ్యమని టీడీపీ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆనందరెడ్డి, నరసింహులు తెలిపారు. అరాచకశక్తులతో అంటకాగిన ఆయన.. అరాచకాలను ప్రశ్నించిన వందలాది మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్యజనంపై దాడులు చేయించి.. అక్రమ కేసులూ బనాయించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన ప్రతిసారీ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించారన్నారు. తమ పార్టీ నేతలతో చంద్రబాబును పరుషపదజాలంతో దూషింప జేయడమేకాకుండా, బాంబులు వేస్తామని బెదిరింపజేశారన్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నా, అభివృద్ధి పరుగులు తీయాలన్నా భరత్ వంటి వ్యక్తులు ఉండరాదని ప్రజలు కూడా భావిస్తున్నారన్నారు. కుప్పం అభివృద్ధిని కాంక్షించి వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ముఖ్యనేతలు టీడీపీలో చేరుతున్నారన్నారు. త్వరలోనే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ దుకాణం బంద్ అవుతుందన్నారు.