03:08:2024, మధ్యాహ్నం 3 గంటల నుంచి 04:08:2024 మధ్యాహ్నం 3 గంటల వరకు ఆషాఢ అమావాస్య ఉంటుంది. ఈ రోజున ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.... నవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో..జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాణం ప్రారంభమవుతుంది...కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఉత్తరాయణం మొత్తం దైవకార్యాలకు, దక్షిణాయణం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది. దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్యే ఈ ఆషాఢ అమావాస్యనే “నక్షత్ర అమావాస్య/ చుక్కల అమావాస్య” అంటారు.
ఈ అమావాస్యనాడు పితృదేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయిజన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయఫలం లభిస్తుంది. ఈ రోజున ప్రతీ ఒక్కరూ తప్పకుండా పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు ఇవ్వాలి.
ఆగష్టు 03 శనివారం మధ్యాహ్నం 3 గంటల 31 నిముషాల నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి.
ఆగష్టు 04 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 54 నిముషాల వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడిచేవారు ఆదివారంనాడు అమావాస్య నియమాలు పాటించాలి.
★గౌరీ పూజ ప్రత్యేకం
ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీపూజ నిర్వహిస్తారు. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శుభాలనిచ్చే శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణం అంటే మళ్లీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం. అందుకే శ్రావణంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ... మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ కన్నెపిల్లలు గౌరీపూజ చేస్తారు. పసుపుముద్దని గౌరీదేవిగా భావించి పూజించి, బియ్యంపిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. కేవలం అవివాహతులే కాదు, కొత్తకోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఉదయాన్నే గౌరీపూజ చేసి, సాయంత్రంవరకూ ఉపవాస నియమాలు పాటిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి, వాటిపై వంద దారపుపోగులు ఉంచుతారు. వాటిని దండగా అల్లుకుని మర్నాడు ధరిస్తారు. ఈ రక్షా కంకణం కట్టుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి.
★గోమాతకి పూజ చేయండి
ఆషాఢమాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు. ఫలితంగా పగటివేళలు తగ్గి, రాత్రివేళలు పెరుగుతాయి. వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా బద్ధకం, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా దీపపూజ చేస్తారు. దేవుడి మందిరం ముందు అలికి, ముగ్గువేసి, దీపాలు వెలిగిస్తారు. దీపాలను పుసుపు, కుంకుమ, పూలతో అలంకరించి, గౌరీదేవికి ప్రత్యేకపూజ చేస్తారు. పూజ అనంతరం, గోమాతకి అరటిపండ్లు తినిపించి, ప్రదక్షిణ చేస్తే... కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
★అమావాస్య వృత్తాంతం↓
పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానస పుత్రి పేరు “అచ్ఛోద”. ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తనతీరంలోనే - స్త్రీ రూపంలో వెయ్యి-ఏళ్ళు
తపస్సు చేసింది. తద్వారా పితృదేవతలు ప్రత్యక్షమయ్యి, ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కానీ, మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం.
ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు, ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి, ఆరోజు పితృ తర్పణాలు ఇచ్చేవారికి అనంత-సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు.
అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి, పితృదేవతలని కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతన పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది.