బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ పాటు పడాలని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసుల రెడ్డి సూచించారు. పట్టణంలోని కథల వీధిలో గల మారెమ్మ ఆలయంలో శుక్రవారం శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ సమితి, 12వ వార్డు టీడీపీ నాయకుడు రుద్రాక్షల మహేష్ ఆధ్వర్యంలో బుడుగ జంగాల కులస్థులకు బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య, సీడీపీఓ ఢిల్లీశ్వరి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆర్డీఓ మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే అమ్మాయి శారీరక.. మానసిక రుగ్మతలకు లోనవుతారని చెప్పారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన డాక్టర్ లక్ష్మణ్‌ప్రసాద్, జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ, వైద్యురాలు స్వాతి, ఏఎ్‌సఐ మంజుల, డీసీపీయూ వెంకటేశ్వరి, వార్డు కౌన్సిలర్ పెద్ద వెంకటేశు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.