నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచకా సాగేందుకు సర్వం సిద్ధమవుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధాని పరిధిలో ‘నవ నగరాల’ నిర్మాణం జరగనుంది. సీఆర్డీయే పరిధిని యథాతథంగా కొనసాగించాలని కొత్త సర్కారు నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సీఆర్డీయే 36వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 12 అంశాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ఎటువంటి సంస్థలను ఆహ్వానించాలి....ఎవరికి భూములు కేటాయించాలి అనే అంశంపైనా ముఖ్యమంత్రి చర్చించారు. దేశంలోని టాప్ 10లోని కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలోనే ఏర్పాటు కావాలన్నారు. కరకట్టపై సెంట్రల్ డివైడర్‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై నాలుగు బ్రిడ్జీలు ఐకానిక్‌గా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్ బ్రిడ్జిపై మరోసారి అధ్యయనం చేస్తామని తెలిపారు. సమీక్ష వివరాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మీడియాతో పంచుకున్నారు.