రాష్ట్రంలో వీలున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వసతి గృహాల వద్ద చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండేలా చూడాలని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వాటి నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీల్లో మౌలిక వసతులు మెరుగు పరచాలని సూచించారు. ‘గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న చోట మినీ అంగన్వాడీల ను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి. మేము సైతం కార్యక్రమాన్ని కొనసాగించాలి. పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. ఇందుకు సమగ్ర ప్రణాళికతో పని చేయాలి’ అని అధికారులకు చంద్రబాబు సూచించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా, శిశు మరణాల నియంత్రణ, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృతహస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. అయితే గత ఐదు ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని వివరించారు. అంగన్వాడీల అప్‌గ్రేడేషన్లో కూడా పురోగతి లేదని వివరించారు.