ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణుల బృందం రాజధాని అమరావతిలో శుక్రవారం పర్యటించింది. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేబీఎల్ సుబ్రహ్మణం, విభాగాధిపతి మున్వర్ బాషాల నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్టర్స్‌ను పరిశీలించింది. సీఆర్డీఏ అధికారులతో భేటీ అయి రెండుగంటలకు పైగా నిపుణులు చర్చించారు. భవన నిర్మాణాల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ప్రొఫెసర్ కేబీఎల్ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో భవన నిర్మాణాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటిని ఎప్పటికి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అనే అంశాలపై సీఆర్డీఏతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. ఎన్నిరోజులు ఉండాలి? ఏయే అంశాలను పరిశోధించాలి? అనే విషయాలపై సీఆర్డీఏ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కొంత మంది సభ్యుల బృందం పరిశీలిస్తోందని, భవిష్యత్తులో ఈ బృందాన్ని పెంచి మరింత విస్తృతస్థాయిలో పరిశోధించి నివేదిక అందజేస్తామని తెలిపారు.