ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణార్థం జనవరి 31వ తేదీ గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు భూకర్షణం మరియు బీజావాపనంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ తెలిపారు. అమరావతిలో శ్రీవారి నూతన ఆలయం నిర్మించే ప్రాంతాన్ని జెఈవో, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ జనవరి 31వ తేదీ గురువారం ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య మీనలగ్నంలో గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు భూకర్షణం మరియు బీజావాపనంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన శ్రీవారిసేవకులు, భజన మండళ్ల సభ్యులు పాల్గొంటున్నారన్నారు. స్థానిక ప్రజల సౌకర్యార్థం గురువారం ఉదయం 6.00 గంటలకు విజయవాడ ఆర్‌టిసి డిపో నుండి 7 బస్సులు, ఉండవల్లి కూడలి నుండి 5 బస్సులు, మంగళగిరి నుండి 5 బస్సులు, తుళ్లూరు ఆర్‌టిసి డిపో నుండి 3 బస్సులు బయలు దేరుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 28వ తేదీ నుండి శ్రీవారి నూతన ఆలయ ప్రదేశమున భూకర్షన బీజవాపన నిమిత్తమై పంచాగ్ని సహిత శ్రీనివాస మహాయాగ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం చతుర్వేద పారాయణం, శ్రీవారి నూతన ఆలయ ప్రదేశంలో భూపరీక్ష, యాగశాల కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 30న చతుర్వేద పారాయణం, గోపూజ, శ్రీవారి నూతన ఆలయ ప్రదేశంలో వాస్తుహోమం, యాగశాల కార్యక్రమాలు చేపట్టారు.
జనవరి 31న ఉదయం 5 నుండి 6 గంటల వరకు చతుర్వేద పారాయణం, ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు యాగశాల కార్యక్రమాలు, యుగళాంగల హల సహిత వృషభపూజ, ఉదయం 9.15 నుండి 9.40 గంటల వరకు మీన లగ్నంలో భూకర్షణ, బీజావాపన, మహాపూర్ణాహుతి, వేదాశీర్వచనం చేపడతారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది.
ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు వసంతోత్సవం, ఫిబ్రవరి 2న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3 నుండి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు భక్తి సంగీతం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. మొదటిరోజు ఋగ్వేదం, రెండో రోజు యజుర్వేదం, మూడో రోజు సామవేదం, నాలుగో రోజు అధర్వణ వేదం పారాయణం చేస్తారు.
రాష్ట్ర అభివృద్ధి, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 7న సాయంత్రం ఆచార్యవరణం, అంకురార్పణ, ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, ఫిబ్రవరి 10న ఉదయం చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, గోగణ నివేదనం, ఉదయం 9 నుండి 10 గంటల వరకు మీన లగ్నంలో ప్రథమ శిలేష్ఠకాన్యాసం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa