కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్ర చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమతలేక దాతల సాయం కోసం అర్థిస్తూ గత వారం రోజులుగా ఎదురుచూస్తున్న ఏలూరుకు చెందిన బాలిక కోటం జ్ఞానేశ్వరికి ఎట్టకేలకు ఆపరేషన్ పూర్తయింది. తమిళనాడు పెరుంబాక్కంలోని గ్లెనిగల్స్ హెల్త్‌సిటీ చెన్నై హాస్పిటల్‌లో చీఫ్ సర్జన్ డాక్టర్ రజనీకాంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం జ్ఞానేశ్వరికి శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జాము 2.30 గంటల వరకు నిర్వహించిన లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్టు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికకు వివిధ వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్స, ఆపరేషన్ అనంతరం పర్యవేక్షణ కాలానికి రూ.40 లక్షలు అవసరమవు తాయని వైద్యులు అంచనావేయగా, అంత భారీ మొత్తంలో ఖర్చు భరించే స్థోమత జ్ఞానేశ్వరి తల్లిదండ్రులకు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ దాతల సాయం కోసం ప్రచురితమైన కథనం అదే రోజు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయుంది. పలు ప్రాంతాల నుంచి స్పందించిన దాతలు తమ విరాళాలను జ్ఞానేశ్వరి తల్లి దుర్గకు ఫోన్‌పే ద్వారా, బ్యాంకు చెక్కుల రూపంలో పంపించారు. మరోవైపు బాలిక ఆరోగ్యస్థితిని తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నేరుగానే జోక్యం చేసుకుని కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని సీఎం కార్యాలయానికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపరేషన్‌కు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. దీంతోపాటు మంత్రి లోకేష్ వ్యక్తిగత సహాయకుడు కూడా జ్ఞానేశ్వరి శస్త్ర చికిత్సకు ప్రభుత్వం నుంచి నిధులు అందజేస్తామని, ఆ మేరకు ఎల్‌వోసీని పంపిస్తామని ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పారని వివరించారు. ప్రస్తుతం ఇది ఫైనల్ ప్రాసెస్‌లో ఉందని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ లోగా బాలిక ఆరోగ్యస్థితి క్షీణిస్తుండడంతో దాతలు అందించిన విరాళాల మొత్తం రూ.10.50 లక్షలను చెల్లించగా, మిగతా మొత్తానికి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యుల నుంచి హామీ తీసుకుని శనివారం శస్త్ర చికిత్స చేశారని వివరించారు. తల్లి దుర్గ కాలేయం మ్యాచ్ కావడంతో అందులో 40 శాతం భాగం సేకరించి, కుమార్తె జ్ఞానేశ్వరికి ఆపరేషన్ ద్వారా అమర్చారు. ఇలా తన లివర్‌లో కొంతభాగాన్ని కోల్పోయిన తల్లి దుర్గ కొంతకాలానికే మెడిసన్‌తో పూర్తిస్థాయిలో రీప్లేస్ అవుతుందని వైద్య నిపుణులు చెప్పారని తెలిపారు. కాగా పూర్తిగా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన జ్ఞానేశ్వరికి అమర్చిన కాలేయం శరీరంలో కలిసి అడ్జస్ట్ చేసుకోవడానికి కనీసం ఆరు నెలలు వైద్యుల పర్యవేక్షణ అవసరమవుతుందని పేర్కొన్నారు. తల్లి దుర్గ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉండగా, కుమార్తె మాత్రం మిగతా అవయవాలు సాధారణ స్థితిలో పని చేసే వరకు కనీసం రెండు రోజులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచాలని వైద్యులు చెప్పారని వివరించారు. ఇక ప్రభుత్వం నుంచి ఆపరేషన్ నిర్వహించిన ఆస్పత్రికి ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎంత మొత్తానికి ఇస్తారో సోమవారం తేలుతుందని భావిస్తున్నామని, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స నిమిత్తమే రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, మరికొంత మొత్తం పోస్ట్‌ఆపరేటివ్ కేర్ ఖర్చుల నిమిత్తం అవసరం ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.