రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇస్తారనుకుంటే.. అవేమీ లేకుండానే పరిపాలనలో తన వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది తేటతెల్లం చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయబోవడం లేదని, ఈ సదస్సులో సీఎం పరోక్షంగా తేల్చి చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఆదాయం పెంచి, హామీలు నెరవేరుస్తానని ఎన్నికల మందు గొప్పగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు, ఆ దిశలో తానేం చేయబోతున్నాడనేది కలెక్టర్ల సదస్సులో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆక్షేపించారు. కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని, సంపద సృష్టిపై వారు దృష్టి పెట్టాలని సీఎం కోరడం ఎంత వరకు సబబు? అన్న కాకాణి, అదెలా సాధ్యమని అన్నారు. వచ్చే సెప్టెంబరు 20 నాటికి, తమ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో, తన మార్క్ పాలన కనిపించాలని చంద్రబాబు కోరారని.. నిజానికి ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు పాలన మార్క్ కనిపిస్తోందని మాజీ మంత్రి చెప్పారు. నారా లోకేష్ రూపొందించిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ.. హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నారని ప్రస్తావించారు. పేరుకే ఉచిత ఇసుక అని, కానీ అందులో యథేచ్ఛగా దోచుకుంటున్నారని చెప్పారు. పదే పదే ఖజానా ఖాళీ అన్న మాట మాట్లాడుతూ, దాని వల్లే ఏమీ చేయలేకపోతున్నామంటూ.. గత తమ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు.