తిరుమల ఘాట్ రోడ్డులో జీఎన్‌సీ చివరి మలుపు దగ్గర స్కిడ్ (జారడం) కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ తీసుకొచ్చి బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా.. తమిళనాడుకు చెందిన దంపతులుగా చెబుతున్నారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరిగింది. కొంతమంది వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొంతకాలంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. కొంతమంది వాహనదారులు విపరీతమైన వేగం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ వంటివి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. కొంతమంది సీటు బెల్టు, హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఘాట్‌రోడ్డులో ఇద్దరు చనిపోయారు.. పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనలు ఉన్నాయి. .
తిరుమలకు భక్తులు రాకపోకలకు సాగించేందుకు రెండు ఘాట్‌రోడ్లు ఉన్నాయి. తిరుమల వెళ్లేందుకు రెండో ఘాట్‌రోడ్డు, కిందకు దిగేందుకు మొదటి ఘాట్‌రోడ్డును ఉపయోగిస్తారు. మొదటి ఘాట్‌రోడ్డులో వాహనాలు కిందకు దిగేందుకు కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలి.. రెండో ఘాట్‌రోడ్డులో పైకి చేరేందుకు 28 నిమిషాల సమయం ఉంటుందనే నిబంధనల్ని కూడా అమలు చేస్తున్నారు. రోడ్డుప్రమాదాలు జరగడంతో టీటీడీ భద్రతా సిబ్బంది, తిరుమల ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే నిబంధనల్ని ఉల్లంఘించేవారిపౌ ఫోకస్ పెట్టి స్పీడ్‌గన్‌తో గుర్తించాలి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర మాత్రమే బైకులు నడిపేవారు హెల్మెట్లు ధరిస్తూ ఆపై తీసేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరికొందరు హెల్మెట్ ఉన్నా సరే ధరించడం లేదు. తాజాగా ఇద్దరు భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.