నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె ఓ విమానం కూలిపోయిన ఘటనలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన ఘటన మరిచిపోకముందే.. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా ఓ హెలికాప్టర్ కొండను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అందులో ఒక పైలట్ సహా నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కొండను ఢీకొట్టి కూలిపోయిందని సమాచారం వచ్చిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టి కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మధ్యాహ్నం 1.54 గంటలకు హెలికాప్టర్ ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
అయితే సూర్య చౌర్ -7 కొండ వద్దకు చేరుకున్న తర్వాత గ్రౌండ్ కంట్రోల్‌తో హెలికాప్టర్ సంబంధాలను కోల్పోయిందని అధికారులు తెలిపారు. ఇక ఆ ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్.. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన 3 నిమిషాలకే సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇలాగే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం కుప్పకూలగా.. ఆ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మరణించారు. ఇక కూలిపోయిన ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్‌కు సీనియర్ కెప్టెన్ అరుణ్ మల్లా పైలట్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్లో మొత్తం ఐదుగురు ఉండగా.. పైలట్‌తోపాటు నలుగురు చైనా పౌరులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.