బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను, ఆమె సోదరి షేక్ రెహానాలను వెంటనే అరెస్ట్ చేసి తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ తాజాగా భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఢాకా నుంచి పారిపోయి భారత్‌లో తాత్కాలికంగా తలదాచుకుంటున్న షేక్ హసీనా, షేక్ రెహానాలు.. లండన్ వెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతి లభించలేదు. పొరుగు దేశాలతో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే తాజాగా బంగ్లాదేశ్ నుంచి ఈ విజ్ఞప్తి రావడం గమనార్హం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
షేక్ హసీనా, షేక్ రెహానాలను వెంటనే అరెస్ట్ చేసి.. బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ కోరారు. తమ దేశానికి పొరుగున ఉన్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని.. చెబుతూనే అందుకు వారిని అప్పగించాలని ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో గత నెల రోజులుగా జరిగిన అల్లర్లలో వందలాది మంది ప్రజలు మరణించారని.. ఆ మృతులకు పూర్తి బాధ్యత షేక్ హసీనా వహించాల్సి ఉందని మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరినీ అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని ఈ సందర్భంగా సూచించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించవద్దంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ మద్దతుదారులతోపాటు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్నవారంతా ఢాకాలో భారీగా పాల్గొన్నారు.
రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు జడ్జిలు.. తమ పదవులకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అదే విధంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ సంస్థల చీఫ్‌లు, ఉన్నతాధికారులు కూడా రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఇక రాజకీయ కక్షతో షేక్ హసీనా గతంలో అరెస్ట్ చేయించిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని వారు తాత్కాలిక ప్రభుత్వానికి సూచించారు.