మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంపై ప్రభుత్వ, విపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘‘తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరు’’ అంటూ మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు తగులపెట్టించి అమాయక ముఖం పెడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. పాపాలు చేసి ఫైళ్లు తగులబెట్టడడం పెద్దిరెడ్డి అలవాటుగా చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి, అతని అనచరులకు వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనకు ముందు కాలుష్య నియంత్రణ మండలిలో కూడా ఫైళ్లు తగలబెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించారు. మదనపల్లె ఫైళ్ల దహనం ఘటన కుట్ర కోణంలో జరిగిందేనని అభిప్రాయపడ్డారు. సీఐడీ విచారణలో దోషులను కచ్చితంగా తేలుస్తామని, పెద్దిరెడ్డే కాదు... అంతకన్నా పెద్ద వారు ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.