విశాఖపట్నం సికింద్రాబాద్ వందేభారత్ రైలు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తోంది. ఒక్క ఆదివారం మాత్రమే విరామం ఇస్తున్నారు. అయితే ఇకపై మంగళవారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు.. విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలు రాకపోకలు సాగించనుంది. రైల్వే అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ పదో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. అప్పటి నుంచి విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేశారు.
మరోవైపు విశాఖపట్నం నుంచి ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ప్రారంభం కానున్న వైజాగ్ సికింద్రాబాద్ వందేభారత్ రైలు.. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం ఐదు స్టేషన్‌లలో విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఆగనుంది. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్‌లలో దీనికి స్టాపింగ్ ఇచ్చారు. అయితే ఈ రైలుకు ఉన్న ఆక్యుపెన్సీకి తోడు, ఆదివారం రోజుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం కూడా రైలు నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ పదో తేదీ నుంచి మంగళవారం విశాఖపట్నం సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు సెలవు ఇచ్చారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాచిగూడ- యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్ - విశాఖపట్నం, విశాఖపట్నం - సికింద్రాబాద్ మార్గాల్లో సహా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందేభారత్ రైళ్లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా భారతీయ రైల్వే ప్రారంభించనుంది. వందేభారత్ రైళ్లు కేవలం పగటి వేళల్లోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దూరప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కూడా ప్రయాణం చేసేందుకు వీలుగా వందేభారత్ స్లీపర్ రైళ్లను రూపొందిస్తున్నారు.