ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చెల్లించే డబ్బుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని.. సమయానికి వారికి డబ్బులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని కూడా తమ కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు మంత్రి మనోహర్. గత ప్రభుత్వం రూ.12లక్షల కోట్ల అప్పులు చేసిందని.. కష్టకాలంలో ఉన్నా రైతుల్ని ఆదుకుంటున్నామన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని..ఆ పెండింగ్ బకాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే అధికారులు చర్యలు చేపట్టారన్నారు. గత నెలలో రూ.వెయ్యి కోట్ల బకాయిలను రైతులకు విడుదల చేశామని.. ఇవా మిగిలిన రూ.674 కోట్లు అందిస్తున్నామన్నారు. అలాగే పంటను నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
ఈ ధాన్యం పెండింగ్ బకాయిలు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో రూ.472 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు గోనె సంచులు కూడా అందజేయలేకపోయిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం రాజీ లేదని..చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించారు మంత్రి మనోహర్. గత ప్రభుత్వం కౌలు రైతుల్ని నిర్లక్ష్యం చేసిందని.. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో కౌలు రైతు కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేశారు.
మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను ప్రజలకు నాణ్యంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాను స్వయంగా, మరికొందరు అధికారులు కలిసి 251 స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నాణ్యత కల్గిన వస్తువులనే ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. 19 సంస్థలు నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిల్ని నేడు విడుదల చేస్తున్నారు. మంత్రి స్వయంగా ఏలూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమలాపురంలో జరిగే కార్యక్రమానికి వెళ్లారు. మంత్రి చేతుల మీదుగా రైతులకు ధాన్యం బకాయిల్ని చెల్లిస్తున్నారు.