రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం తిరోగమనం బాట పట్టిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కొన్ని సర్దుబాట్లు చేయాలనే సాకుతో, విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని, సంస్కరణలు చేస్తామంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎత్తేస్తున్నారని గుర్తు చేశారు. టోఫెల్ శిక్షణ రద్దు, ఇంగ్లీషు మీడియంను ఎత్తేసే కార్యక్రమంపై ప్రభుత్వ పెద్దల మాటలు చూస్తుంటే విద్యా రంగం అస్తవ్యస్తం అవుతోందన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో 5 ఏళ్ల వైయస్ఆర్‌సీపీ పాలన నిర్ణయాలను రద్దు చేసి, ప్రజలకు నష్టం కలిగిస్తే సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. నాడు సీఎం వైయస్ జగన్, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ఆ రంగంపై ఏకంగా రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన ప్రిప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు థీటుగా తీర్చిదిద్దితే, దానిపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఇవన్నీ చూస్తుంటే, ఈ ప్రభుత్వం జాతీయ విద్యా విధానాని (ఎన్‌ఈపీ)కి అనుకూలమా? వ్యతిరేకమా? అన్న అనుమానం కలుగుతోందన్న మాజీ మంత్రి, అసలు ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు.