ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా ఐదేళ్లపాటు ఒకేచోట ఉద్యోగం చేస్తున్నవారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మిగిలిన ఉద్యోగులను పరిపాలనాపరమైన అవసరాల మేరకు బదిలీ చేయనున్నారు. తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా బదిలీల పరిధిలోకి వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ గ్రామసభలను బదిలీల నేపథ్యంలోనే వాయిదా వేసింది. ప్రాథమికంగా రెవెన్యూ ల్యాండ్స్, సివిల్ సప్లైస్, గనులు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు జరుగుతాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్, ఇతర శాఖల్లో బదిలీలు ఇప్పుడే ఉండవు. ఎక్సైజ్‌లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖలో బదిలీలు చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. ఆతర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించనున్నారు. వాస్తవానికి వీరిని ఉన్న స్థానాల నుంచి కదిలించరు. కానీ, వారు బదిలీ కోరుకుంటే.. కోరుకున్న చోటకు పంపుతారు. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు, తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులున్న ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కారుణ్య నియామక ఉద్యోగులు, జీవిత భాగస్వాములు, వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.