రాజకీయ విలువలకు కట్టుబడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నుంచి ఎవరినీ బరిలోకి దింపడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్టాడుతూ..... వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి భారీ మెజారిటీని కట్టబెట్డారని, జిల్లాలోనే ముగ్గురు అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. రెండేళ్ల క్రితం ఈ ఎన్నిక జరిగినపుడు ప్రతి పక్ష పార్టీల నుంచి ఎవరూ బరిలో దిగుకుండా, నామినేషన్లు వేయకుండా వైసీపీ భయాందోళనలకు గురిచేసిందన్నారు. అయితే అలాంటి రాజకీయాలు చేయడం సరైన విధానం కాదని అధిష్ఠానం భావించడంతో పోటీకి దూరమయ్యామన్నారు. వైసీపీకి చెందిన అనేక మంది నాయకులు కూటమిలో చేరుతామని, ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలిపితే మద్దతు ఇస్తామని ముందుకు వచ్చారన్నారు. అయితే వారిని పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకుని సాధించేదేమీ లేదన్నారు. అయితే జిల్లాలో కూటమికి మెజారిటీ లేదనో, విజయం సాధించలేమనే భయంతోనో తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా సాగాలనే ఉద్దేశంతోనే బరి నుంచి తప్పుకున్నట్టు పల్లా వివరించారు.