తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేటు తెగిపోవడంతో జలాశయంలో నీరు వృథా అవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున తదితరులతో కలిసి ఆయన జలాశయాన్ని మంగళవారం పరిశీలించారు. జలాశయం కింద కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ పరిధిలో 12 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సరిపడా నీరు ఈ ఏడాది ఆగస్టుకు ముందే నిల్వ ఉండటంతో రైతులు సంతోషించారని అన్నారు. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభిస్తున్న తరుణంలో గేటు తెగిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన, కేంద్రంలో ప్రధాని మోదీ తుంగభద్ర జలాశయం అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. ప్రతి ఏటా గేట్లను పరిశీలించి, భద్రతా చర్యలు చేపట్టివుంటే ఇలాంటి సమస్య ఉండేది కాదని అన్నారు. త్వరితగతిన గేటును పునరుద్ధరించి, ఖరీఫ్ పంటల సాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని డ్యాం పరిశీలనకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.