అన్నక్యాంటీన్లను ఈనెల 15వ తేదీన ప్రారంభించనున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం ఎనిమిది అన్నక్యాంటీన్లు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేద, బలహీన, అట్టడుగు వర్గాల ప్రజలు, చిరువ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, కార్మికుల నుంచి విశేష ఆదరణ పొందిన అన్నక్యాంటీన్లు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. టీడీపీ హయాంలో వీటిని విజయవంతంగా అమలుచేయగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నక్యాంటీన్లను మూసివేశారు. భవనాలను నిరుపయోగంగా మార్చారు. పలుచోట్ల ఇతర అవసరాలకు వినియోగించారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా అన్నక్యాంటీన్ భవనాల ఆధునికీకరణకు నిధులు కేటాయించి పనులు నిర్వహించారు. క్యాంటీన్ భవనాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కాకినాడ నగరంలోని అన్నమ్మఘాటీ జంక్షన్, డెయిరీ మార్కెట్, సంతచెరువు, సర్పవరం జంక్షన్, వివేకానంద పార్కు వద్ద ఉన్న అన్నక్యాంటీన్లతోపాటు పిఠాపు రం, పెద్దాపురం, సామర్లకోటల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.