రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రతి నెలా బియ్యంతోపాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్ధరించేందుకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ మూడు పండగలకు రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందించడానికి ఏడాదికి రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం పడుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం (2014-19) ఉన్నప్పుడు ఏటా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలను అందించింది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరలీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 మిల్లీ గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందించారు. క్రిస్మస్ కానుక కింద కూడా అవే ఇచ్చారు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు 2 కిలోల చక్కెర, 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను ఉచితంగా అందించారు. ఆ తర్వాత 2019 జూన్‌లో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్‌కార్డు దారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 12 లక్షలకుపైగా ముస్లిం కార్డుదారులున్నారు. ఇవి కాకుండా ప్రతినెలా రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతో చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.