విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్ వలయంలో చిక్కుకోకుండా సజావుగా ప్రయాణం సాగించడానికి పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. దీనికి అధునాతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించుకోనుంది. అమరావతిలో ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ఏఐను వినియోగిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఇది జరిగిన నాలుగు రోజులకే విశాఖపట్నంలో కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ఏఐ టెక్నాలజీ అందించే పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను చూశారు. ట్రాఫిక్‌ను అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా మళ్లించడానికి అవకాశాలు ఏమి అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు. మొత్తం మూడు కంపెనీలు రాగా తొలుత రెండు ప్రధాన జంక్షన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.