మెరుగైన విద్య, వైద్యం ద్వారా ఎన్నో మార్పులు వస్తాయని, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మారుతాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అందుకే ఆయా రంగాలకు గత ప్రభుత్వంలో వైయస్ జగన్‌గారు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఇప్పుడు చంద్రబాబు వాటన్నింటినీ పక్కన పెట్టేశారని ఆక్షేపించారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడంలో చంద్రబాబుగారిని మించిన వారు లేరన్న అంబటి రాంబాబు, అదే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు వైయస్ జగన్‌గారు అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టి, అమలు చేశారని, ఆ దిశలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. జల జీవన ప్రమాణాలు పెరగాలని, మావన వనరులే సమాజానికి సంపద అని భావించి.. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు, పోర్టులు, హార్బర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. మనకు సువిశాలంగా దాదాపు 1000 కి.మీ సముద్రతీరం ఉందని, అందుకే పెద్ద ఎత్తున పోర్టుల నిర్మాణం చేపట్టారని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌గారు, నాడు–నేడు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మార్పులు చేశారని గుర్తు చేశారు. అమ్మ ఒడి కాపీ కొట్టిన చంద్రబాబు, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టినా, దాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని ఆక్షేపించారు.