మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్ల వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నూజివీడు మండలం ముక్కొల్లుపాడులో చోటు చేసుకుంది. ముక్కొల్లుపాడుకు చెందిన తమ్మిశెట్టి సక్కమ్మ (40) పలు ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి సుమారు రూ. 3 లక్షల వరకు రుణం తీసుకుంది. ఈ రుణం ఇప్పించడంలో ముక్కొల్లుపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ ఏజెంటుగా వ్యవహరించగా గత నెలలో భారీ వర్షాల కారణంగా పనులు లేక రుణ వాయిదాలు చెల్లించడంలో సక్కమ్మ విఫలమైంది. దీంతో రుణ వాయిదాలు చెల్లించాల్సిందిగా ఏజెంటు నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వేధింపులు భరించలేక బుధవారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన సక్కమ్మ భర్త రాజు సమాచారాన్ని బంధువులకు, పోలీసులకు తెలియజేయడంతో సక్కమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.