పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన కేసు విచారణ సెప్టెంబరు 9వ తేదికి హైకోర్టు జడ్జి జస్టిస్ వి.శ్రీనివాస్ వాయిదా వేశారు. బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఎన్నికల అఫిడవిట్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతలకు చెందిన 142 ఆస్తుల వివరాలు పొందపరచలేదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీసీవైపార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ గత నెల నాలుగోతేది హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణ జరిగింది. ఈపీ నెంబరు 3/2024ను జస్టిస్ శ్రీనివాస్ గత నెల 24, 31వ తేది, బుధవారం కేసుకు సంబంధించిన వివరాలపై విచారణ జరిగింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గత వాయిదాలోనే గెలుపొందిన వారి తర్వాత అధికంగా ఓట్లు వచ్చిన పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని ఈకేసులో ఇంప్లీడ్ కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసు పంపాలని, వచ్చేనెల 9వ తేదికి విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు జడ్డి ఆదేశించారు.