78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలు దశలవారీగా చెల్లిస్తున్నామన్నారు. టెలీ మెడిసిన్‌ను విస్తృత పరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్‌ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తామని... గిరిజన గర్భిణీలను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడించారు. తద్వారా మాతాశిశు సంరక్షణ చేపడతామన్నారు. ‘‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’’ను తిరిగి ప్రవేశ పెడతామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నామని సీఎం అన్నారు.