ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గూడెంలో 30 మందికి పైగా గిరిజనులు విషజ్వరాలు, మలేరియాతో మంచం పట్టారు. వీరిలో పెద్దలు, పిల్లలు కలిపి 10 మందికిపైగా ఎర్రగొండపాలెం వైద్యశాలలో బుధవారం చేరి చికిత్స పొందుతున్నారు. జ్వరం సోకిన చిన్న పిల్లలకు వైద్యులు సెలైన్ బాటిళ్లను ఎక్కిస్తున్నారు. ఎర్రగొండపాలేనికి 40 కి.మీ దూరంలో ఉన్న పాలుట్ల గూడెం నుంచి వైద్యశాలలకు రావాలంటే రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి జ్వరం తగ్గకపోవడంతో చెవుల పొట్టి పోతమ్మ, చెవుల వీరమ్మ, మండ్లి అంజయ్య, మరో ఐదుగురు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. గూడెంనకు చెందిన చిన్నారులు కుడుముల నందిని, దేశావత్ అభినాయక్, నిర్మల, చెవుల హనుమమ్మ, చెవుల అంజలి, దంసాని వీరయ్య తదితరులు జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వీరు గాక గూడెంలో మరో 20 మందికి పైగా జ్వరాలు ఉన్నాయని దేశావత్ సురేష్ నాయక్, గూడెం గిరిజనులు తెలిపారు. కలెక్టర్ స్పందించి వెంటనే వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.