ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించని సీఎం చంద్రబాబు, తానేమీ మారలేదని మరోసారి రుజువు చేశారని.. ప్రజా వ్యతిరేక విధానాలకు దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నాని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. టెర్రరిజం గురించి, నియంత పాలన గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే, దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి విషయంలో ప్రజల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ ధనదాహంతో ఆలోచించారని కాకాణి తేల్చి చెప్పారు. రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లంటూ పదే పదే అబద్ధాలు చెప్పిన చంద్రబాబు, దమ్ముంటే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్నారన్న కాకాణి, ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి మాయం చేశారని ఆరోపించారు. తల్లికి వందనం అంటూ ఈ ఏడాదికి ఎగనామం పెట్టిన పథకానికి స్వాతంత్య్ర దినోత్సవాన శకటం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఊసెత్తని చంద్రబాబు, రెడ్ బుక్ పాలనకే మొగ్గు చూపుతాం అన్న సంకేతాలివ్వడం దారుణమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఒక్క మంచి పని చేయని చంద్రబాబు, ఇప్పుడు కూడా 16 మంది సీనియర్ ఐపీఎస్‌లను వేధిస్తున్నారని, ఇది సీఎం అనైతిక పాలనకు పరాకాష్ట అని అభివర్ణించారు. ఇదే పంథాలో కొనసాగితే చంద్రబాబు నుంచి ప్రజలు స్వాతంత్య్రం తెచ్చుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందని కాకాణి హెచ్చరించారు.