ప్రభుత్వాలు మారినా ప్రజలకు మేలు చేసే పథకాల అమలులో మార్పులు ఉండరాదని, ప్రజా ప్రయోజనానికి రాజకీయ కోణం ఆపాదించడం సరికాదని శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు స్పష్టం చేశారు. నిరు పేదలకు అతి తక్కువ ధరకు భోజనం అందించే విధంగా రూపొందించిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో మూలన పడేసి పేదల కడుపు కొట్టిందన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని పున: ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.. ఆ మేరకు హామీని నిలబెట్టుకుంటూ అన్న క్యాంటీన్ ను పున: ప్రారంభించినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం పిఠాపురంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ సమీపంలో అన్న క్యాంటీన్ ని పునః ప్రారంభించారు. స్వయంగా పేదలకు అల్పాహారాన్ని వడ్డించారు. ప్రజలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ.. "పేద ప్రజలకు రూ. 5కే రుచికరమైన భోజనం పెట్టాలన్న సదుద్దేశంతో తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలతో ఆపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి పేదల కడుపు నింపే ఈ పథకాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఒక బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తిరిగి ప్రారంభించడం జరిగింది. రోజు వారీ పనులు చేసుకునే నిరుపేదలు, రిక్షా కార్మికులు, సుదూర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు తరలి వచ్చే పేదలకు అతి తక్కువ ధరకు భోజనం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. పిఠాపురంలో పేదల ఆకలి తీర్చేందుకు మరిన్ని అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యోచిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు ఖరారు చేశారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని ప్రజా ప్రయోజన పథకాలు తీసుకువస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంద"న్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.