అన్నమయ్య జిల్లాలో విషాదం జరిగింది. రాయచోటి మండలం కొత్తపేటలో తల్లి సహా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే సజీవ దహనం అయ్యారు. పట్టణంలోని తొగట వీధిలో ఈ ఘటన జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం ఎర్రగుడికి చెందిన రమాదేవి, తన ఇద్దరు పిల్లలు మనోహర్, మన్వితలు ఈ ఘటనలో మృతి చెందారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రమాదేవి భర్త రాజా జీవనాధారం కోసం కువైట్‌లో ఉంటున్నాడు. .రమాదేవి ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? కావాలని చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
రమాదేవి పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు చెబుతున్నారు. అలాగే మరో వాదన కూడా వినిపిస్తోంది.. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. ప్రమాదమా?.. ఆత్మహత్యా క్లారిటీ రావాల్సి ఉంది. రాయచోటిలో ప్రమాదం జరిగిన స్థలాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మంత్రి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.. ప్రమాద ఘటనపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను వేగంగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. అలాగే రమాదేవి భర్తకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.