ఏపీలో వెయిటింగ్ ఐపీఎస్‌ల వ్యవహారం చర్చనీయాంశమైంది. 16మంది ఐపీఎస్‌లు ప్రతి రోజూ డీజీపీ కార్యాలయంలోనే ఉండాలని.. ప్రతి రోజూ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో వెయిటింగ్ ఐపీఎస్‌లు ముగ్గురు రెండు, మూడు రోజుల సెలవులపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఏకంగా 15-20 రోజుల దీర్ఘకాలిక సెలవు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం కొందరు ఐపీఎస్‌లు మాత్రమే వచ్చారు. మరికొందరు ముందస్తు అనుమతి తీసుకుని రాలేదనట.. ముగ్గురు అధికారులు లాంగ్ వీకెండ్, వరలక్ష్మీ వ్రతం ఉండటంతో రెండు, మూడు రోజులు సెలవు పెట్టారని సమాచారం. కొద్దిమంది సీనియర్ అధికారులు మాత్రం దీర్ఘకాలిక సెలవు కోసం సాధారణ పరిపాలన శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ పేర్లేవీ బయటకు మాత్రం రాలేదు.
వెయిటింగ్ ఐపీఎస్‌లలో 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆ తర్వాత శని, ఆది వారాలు సెలవు కావడంతో.. కొందరు ఈ నెల 13, 14న.. మరికొందరు 16న సెలవు పెట్టినట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ రావడంతో మధ్యలో సెలవులు పెట్టుకున్నారని.. సోమవారం రాఖీ పండుగ తర్వాత వారు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో 16మంది డీజీపీ కార్యాలయానికి రావడం లేదనే ఫిర్యాదులు వచ్చాయట. వీరంతా ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి, హాజరుపట్టీలో సంతకం చేయాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ డీజీపీ జారీ చేసిన ఆదేశాల్లో.. వెయిటింగ్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులు రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ హాజరు పట్టీలో సంతకాలు చేయాలని సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం విధుల సమయం ముగిసేవరకూ కార్యాలయంలోనే ఉండి సంతకం చేశాకే మళ్లీ బయటకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు కుట్ర చేస్తున్నట్లు నిఘా విభాగం గుర్తించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణను తప్పుదోవ పట్టించేలా అధికారులను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో తమ పాత్రను, వైఎస్సార్సీపీ పెద్దల వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించేలా.. విచారణ తూతూ మంత్రంగా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు వినిపించాయి. అందుకే వీరందరికి మెమోలు జారీ చేసినట్లు సమాచారం.
వెయిటింగ్‌లో ఉన్న అధికారుల్లో.. పీఎస్‌ఆర్ ఆంజనేయులు (డీజీ), పీవీ సునీల్‌కుమార్ (డీజీ), కాంతి రాణా తాతా (ఐజీ), జి.పాలరాజు (ఐజీ), కొల్లి రఘురామ్‌రెడ్డి (ఐజీ), ఎన్.సంజయ్ (అదనపు డీజీ), ఆర్.ఎన్.అమ్మిరెడ్డి (డీఐజీ), సీహెచ్.విజయరావు (డీఐజీ), విశాల్ గున్నీ (డీఐజీ), కేకేఎన్ అన్బురాజన్ (ఎస్పీ), వై.రవిశంకర్‌రెడ్డి (ఎస్పీ), వై.రిషాంత్‌రెడ్డి (ఎస్పీ), కె.రఘువీరారెడ్డి(ఎస్పీ), పి.పరమేశ్వర్‌రెడ్డి (ఎస్పీ), పి.జాషువ (ఎస్పీ), కృష్ణకాంత్ పటేల్ (ఎస్పీ)లు ఉన్నారు.