ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
మరోవైపు ఏపీలో ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని మంత్రి నారా లోకేష్ వారికి సూచించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో భేటీ విషయాన్ని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్ సీనియర్ బృందాన్ని అమరావతిలో కలవడం చాలా సంతోషంగా ఉందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ వాహనాలు, డిజిటల్ హెల్త్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి మనదేశంలో మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యాలు అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విజన్‌ను వారికి వివరించినట్లు లోకేష్ తెలిపారు.
అలాగే ఉద్యోగాల కల్పన కోసం ఫాక్స్‌కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి కాలం చెల్లిందన్న నారా లోకేష్.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేదే తమ ప్రభుత్వం కొత్త మంత్రమని అన్నారు. ఫాక్స్‌కాన్ సహా ఇతర అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల కోసం వేగంగా ఇండస్ట్రియల్ జోన్లు రూపొందించడమే తమ లక్ష్యమంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ ఆసక్తిని చూపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ ఇటీవలే ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఉన్న చరిత్ర. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు.