ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శాఖాపరమైన విషయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. శాఖల గురించిన సమాచారం తెలుసుకోవటంతో పాటుగా పాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల కోసం ఈ నెలాఖర్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 23 నుంచి గ్రామ సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ సభల నిర్వహణ, విధివిధానాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్వహణ, విధివిధానాల గురించి పలు సూచనలు చేశారు.
ఆగస్ట్ 23 నుంచి ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేయవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్న పవన్ కళ్యాణ్.. ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చుపెట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు వరకూ ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి పంచాయతీ రాజ్, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి ఇప్పటికే ఉపాధి హామీ పథకం పనిదినాలు పెరిగిన సంగతి తెలిసిందే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్రం ఏపీకి కేటాయించిన పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వినతితో మరో ఆరున్నర కోట్ల పనిదినాలను అదనంగా కల్పి్స్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనివలన ఏపీలోని 54 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది.