కోనసీమ జిల్లా మత్స్యకారుల పంట పడింది. చేపల కోసం వలేస్తే ఏకంగా బాహుబలి చేప చిక్కింది. కోనసీమ జిల్లా అంతర్వేది సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లకు భారీ టేకు చేప చిక్కింది. ఈ బాహుబలి చేప ఏకంగా 1800 కేజీల బరువున్నట్లు తెలుస్తోంది. కాకినాడకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపలవేటకు వెళ్తే.. ఈ భారీ టేకు చేప వారి చేతికి చిక్కింది. టేకు చేప భారీ సైజులో ఉండటంతో ఒడ్డుకు చేర్చడానికి ఆపసోపాలు పడ్డారు. సుమారు 30 మంది మత్స్యకారులు ఒడ్డుకు తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేశారు. అయినప్పటికీ వీలుకాకపోవటంతో క్రేన్ సాయంతో ఈ టేకు చేపను ఒడ్డుకు తెచ్చారు. ఇక భారీ చేప దొరికిందని తెలియటంతో చుట్టుపక్కల స్థానికులు చూడటానికి ఎగబడ్డారు.
మరోవైపు ఈ చేపను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ప్రయత్నించారు. అయితే బేరం తెగకపోవటంతో కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలించారు. అయితే టేకు చేపలు వలలో పడటం చాలా అరుదుగా జరుగుతుందంటున్న మత్స్యకారులు.. ఇంత పెద్ద చేప అంతర్వేదిలో చిక్కడం ఇదే తొలిసారని చెప్తున్నారు. ఇది సొర చేప జాతికి చెందినదిగా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ టేకు చేపపై ఉండే శంకులతో అలంకరణ వస్తువులు చేస్తారని.. అందుకే వీటిని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారని వివరించారు.
మరోవైపు ఈ టేకు చేపలు ఎక్కువగా సముద్రం అడుగు భాగంలో సంచరిస్తూ ఉంటాయని.. అందుకే బయటకు రావని మత్స్యకారులు చెప్తున్నారు. . అలాంటి చేప వలకు చిక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ టేకు చేపకు వెనుక భాగంలో ముళ్లు ఉంటాయని.. ఇవి చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. సముద్రంలో ఉండే మిగతా పిల్లచేపలను తింటూ భారీ సైజులో పెరుగుతాయని వివరిస్తున్నారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ టేకు చేపలు .. ఏదైనా ఆపద ముంచుకువస్తోందని భావిస్తే మాత్రం ప్రమాదకరంగా స్పందిస్తాయని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. ఇంత పెద్ద చేప దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.