వైయస్ రాజశేఖరరెడ్డి గ స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించిందే డాక్టర్ వైయస్సార్ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో.. రోజుకు 3,100 క్యూసెక్కులు చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ.ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమల సాగర్‌కు నీటిని తరలించి ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993-94లో డీపీఆర్ రూపొందించారు. కానీ 2004 వరకు పట్టించుకోలేదు. వైయస్సార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. 2004 అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.3,610 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్‌తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమల సాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కి.మీ. పొడవున ఫీడర్ చానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు పూర్తి చేశారు. 2004-2014 మధ్య టన్నెల్-1లో 11.586 కి.మీ. పొడవున నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం రూ.469.37 కోట్లు వెచ్చించారు. రోజుకు సగటున 5.53 మీటర్ల మేర తవ్వకాలు జరిగాయి. టన్నెల్-2కు సంబంధించి 8.747 కి.మీ. పొడవున నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం రూ.410 కోట్ల మేర ఖర్చు చేశారు. రోజుకుసగటున 4.79 మీటర్ల తవ్వకాలు జరిగాయి. మొత్తంగా 20.333 కి.మీ. పొడవున తవ్వకాలు పూర్తి చేశారు. రూ.879.67 కోట్లు వైయస్సార్ హయాంలో ఖర్చు చేశారు. అదే 2014-19 వరకు టీడీపీ హయాంలో టన్నెల్-1కు సంబంధించి రోజుకు 4.331 మీటర్ల పొడవున తవ్వకాలు జరిగాయి. ఇందుకు రూ.284.257 కోట్లు వెచ్చించారు. రోజుకు కేవలం 2.41 మీటర్ల మేర మాత్రమే పనులు చేశారు. టన్నెల్-2కు సంబంధించి 2.355 కి.మీ. పొడవున తవ్వకాలు చేసి రూ.136.37 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు సగటున 1.31 మీటర్ల మేర మాత్రమే తవ్వకాలు జరిగాయి. మొత్తంగా టీడీపీ హయాంలో 6.686 కి.మీ. మేర తవ్వకాలు జరిపి రూ.420.627 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. వెలిగొండ ప్రాజెక్టులో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచి పెట్టారని కాగ్ సైతం తేల్చింది. అదే జగన్ హయాంలో చూస్తే.. 2019-24 మధ్య టన్నెల్-1కు సంబంధించి 2.883 కి.మీ. పొడవున తవ్వకాలు చేశారు. ఇందుకు రూ.203.503 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు సగటున 4.12 మీటర్ల తవ్వకాలు జరిగాయి. టన్నెల్-2కు సంబంధించి 7.685 కి.మీ. పొడవున తవ్వకాలు జరిగాయి. ఇందుకు రూ.304.380 కోట్ల వ్యయం చేశారు. రోజుకు సగటున 7.25 మీటర్ల మేర తవ్వకాలు జరిగాయి. మొత్తంగా జగన్ హయాంలో 10.568 కి.మీ. పొడవున తవ్వకాలు పూర్తి చేసి రూ.507.883 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మొత్తంగా జగన్ హయాంలో రూ.978.02 కోట్లు ఖర్చు చేసి అందులో ప్రతి పైసానూ సద్వినియోగం చేసుకుని వెలిగొండ జంట సొరంగాల్లో మిగిలిన 10.568 కి.మీ. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేశారు.