మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలుగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టావంటూ జగన్‌పై దుయ్యబట్టారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన చరిత్ర వైసీపీది అని వ్యాఖ్యలు చేశారు.