అనకాపల్లిలోని అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కోట ఊరట్లలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పాస్టర్ కిరణ్ భార్య రమ మీడియాతో మాట్లాడారు. ‘‘శనివారం రాత్రి నక్కపల్లి, పొందూరుకు చెందిన ఇద్దరు దాతలు ఆహారం ఇచ్చారు. ఒక దాత సమోసా, చాక్లెట్లు ఇవ్వగా... మరో దాత బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, పునుగులు, కూర ఇచ్చారు. వైట్ రైస్, సాంబార్ తిన్న నలుగురు పిల్లలు చనిపోయారు. ముగ్గురు పిల్లలు చనిపోవడం మా దురదృష్టకరం. దాతలు ఇచ్చిన ఆహారమే పిల్లలతో పాటు మేము తిన్నాం. ఏజెన్సీ, తండాలకు చెందిన పిల్లలు విద్యను అందించడమే మా లక్ష్యం. చిన్న తరగతుల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన 86 మంది పిల్లలు ఉన్నారు. సంస్థ నిర్వహణలో ఎటువంటి దురుద్దేశం లేదు’’ అని రమ స్పష్టం చేశారు.