గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు. 23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరి వారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతిగా మైసూరివారిపల్లె నిలిచింది. డిప్యూటి సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా.. గ్రామసభపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని నేను నమ్ముతున్నా. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు, అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.