తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి నకిలీ టికెట్లు అమ్ముతున్న ముఠాని పోలీసులు గుట్టురట్టు చేశారు. టూరిజం శాఖ ముసుగులో కొంత కాలంగా నకిలీ టికెట్ల దందా సాగుతోంది. ప్రతి నిత్యం 30నుంచి 40మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనానికి దళారీలు అనుమతిస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్, టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి కొంత కాలంగా దందా సాగిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కూపీ లాగి దీని వెనక ఎవరు ఉన్నారు, ఎంత కాలంగా ఈ వ్యవహారం సాగుతోందనే అంశాలపై విచారణ చేపట్టారు. నకిలీ టికెట్ల వ్యవహారంలో ఉద్యోగులే కీలకంగా ఉన్నారని తెలిసి టీటీడీ సిబ్బంది, పోలీసులు అవాక్కయ్యారు. దీని వెనక ఉన్న ఐదుగురిపై వెంటనే కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.