పార్వతీపురం, జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభల నిర్వహణ, అందుకు సంబంధించిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ‘గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలి. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, వాటి వివరాలను తెలియజేసే విధంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి.’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. అనంతరం బలిజిపేట మండలం పెదపెంకిలో పారిశుధ్యంపై ఆయన ఆరా తీశారు. పంచాయతీల్లో పారిశుధ్యం సక్రమంగా లేదని, ఫైలేరియా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పంచాయతీలో సిఫారసులను పరిగణనలోనికి తీసుకొని అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.