గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో శానిటేషన్ అధికారుల తీరు ఆక్షేపణీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళవారం మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆమె పాల్గొని పలు సమస్యల్ని ప్రస్తావించారు. ప్రధానముగా శానిటేషన్ విషయంలో అధికారుల తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. పారిశుధ్య నిర్వహణ తీరు ఎలా ఉంది అంటే శిధిలం అయిపోయిన కాంపాక్ట్ డస్ట్ బిన్ల స్థానంలో కొత్తవి కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అసలు శానిటేషన్ విషయంలో కార్పొరేటర్లు గాని ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఒక్క దానికి కూడా సరయిన సమాధానం ఇవ్వలేకపోతున్నారంటే అధికారుల పని తీరు ఎలా ఉందొ మునిసిపల్ కమిషనర్ అర్ధం చేసుకోవాలి. గుంటూరు శ్యామల నగర్ లో శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ లీజు ముగుస్తున్న సమయంలో దానిని పొడిగించాలని కోరుతున్నాను. ఎందుకంటె ఈ స్కూల్ లో అనేక మంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. 1965 లో దీనిని నామామాత్రపు ఫీజుతో స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ చేత ప్రశంసించబడిన ఆ పాఠశాలను రాజకీయ కోణంలో చూడకుండా ప్రత్యేక అంశంగా పరిగణించాలని కోరుతున్నాను.