టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపరాఫర్ ఇచ్చారు. ఎన్నికల్లో తాను విజయం సాధించి, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటానని, అలా కాకుంటే ఆయనను సలహాదారుడిగానైనా నియమించుకుంటానని ట్రంప్ తెలిపారు. మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. అంతేకాదు, ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తోన్న 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని వెల్లడించారు. ట్యాక్స్ క్రెడిట్‌లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఈ ఆఫర్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. తాను సిద్ధమేనని ప్రకటించారు. ఈ మేరకు మస్క్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’కి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను కూడా పెట్టారు.. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి.. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ట్రంప్‌తో జరిగిన చర్చలో మస్క్ ప్రతిపాదించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు ఎలాన్ మస్క్ తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన టెస్లా సీఈఓ... జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ప్రశంసించారు. ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో బలపడుతున్నాయి. గతవారం ట్రంప్‌ను ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే, కీలక పదవి ఇస్తానని మస్కకు ట్రంప్ ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2016 ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు రెండు కీలక అడ్వైజరీ బోర్డులకు మస్క్‌ను ఎంపిక చేశారు. కానీ, పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లో వాటి నుంచి తప్పుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఇస్తోన్న ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసే యోచనలో ట్రంప్ ఉన్నారు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఆ మేరకు నిబంధనల్లో మార్పులు లేదా దాన్ని పూర్తిగా రద్దు చేసేలా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ (Trump) తాజాగా వెల్లడించారు. అధిక ధరల వల్ల ఎలక్ట్రిక్ కార్లకు అంతగా గిరాకీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తాను పెట్రోల్ కార్ల తయారీ వైపు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.