తీవ్ర తుఫాను కారణంగా ఓ విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో బ్రిటన్‌కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, ఆయన 18 ఏళ్ల కుమార్తె సహా ఏడుగురు గల్లంతయ్యారు. విషాదకర ఈ ఘటన ఇటలీలోని సిసిలీ తీరం సమీపంలో ఆగస్టు 19 తెల్లవారుజామున చోటుచేసుకుంది. గల్లంతైనవారిలో నలుగురు యూకే పౌరులు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటివరకు ఒకరి మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి లించ్ భార్య ఏంజెలా బకేర్స్‌తో పాటు మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు.. నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నౌక ఆగస్టు 14న సిసిలీ పోర్టు నుంచి 10 మంది సిబ్బంది 12 మంది ప్యాసింజర్లు సహా మొత్తం 22 మందితో బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త మైక్ లించ్ (59)..ఆయన కుమార్తె, ఏడాది వయసున్న ఓ చిన్నారి సహా ఏడుగురు ఆచూకీ తెలియరాలేదని, 15 మందిని రక్షించామని చెప్పారు. టెక్ దిగ్గజ సంస్థ అటానమీ కార్పొరేషన్ అధినేత అయిన మైక్ లించ్.. మెరికాలో ఓ మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. ఆయనను బ్రిటన్‌కు చెందిన బిల్‌గేట్‌గా పిలుస్తారు.
ప్రమాదం నుంచి బయటపడిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో భారీ అల తాకడంతో నౌక ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి మునిగిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ దళాలు.. వెంటనే రంగంలోకి దిగాయి. ఉపరితలం నుంచి 50 అడుగుల లోతులో నౌక ఉన్నట్టు గుర్తించిన డైవర్లు.. లోపలి ఉన్నవారి కోసం గాలించారు. 15 మంది సురక్షితంగా బయటకు తీశారు. దురదృష్టవశాత్తూ లించ్, ఆయన కుమార్తె హన్నా లించ్ కనిపించకుండాపోయారు.
ఇక, ఓ మహిళ తన ఏడాది కుమార్తెను కోల్పోయింది. బిడ్డ తన చేతుల్లో ఉండగానే సముద్రంలోకి జారిపోయింది. రెండు సెకెన్ల వ్యవధిలోనే నా బిడ్డను పోగొట్టుకున్నానని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ‘రెండు సెకన్లలోనే నా కుమార్తెను పోగొట్టుకున్నాను.. అలల తీవ్రతకు ఆమెను గట్టిగా పట్టుకున్నాను.. నాకు దగ్గరగా. చాలా మంది అరుస్తున్నారు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.. అదృష్టవశాత్తూ లైఫ్ బోట్ కారణంగా మాలో 11 మంది బయటపడగాలిగాం’ అని ఆమె తెలిపింది. ఈ నౌకలో తాను, తన భర్త, కుమార్తె ఉన్నామని, ఆయన కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పింది.