రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులపై పోలీసుల వేధింపులు అధికమయ్యాయని కమలాపురం మాజీ శాసన సభ్యుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. కడప నగరంలోని రవీంద్రనాథ్ రెడ్డి స్వగృహంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ నాయకుడు సాయినాథ్‌శర్మపై కమలాపురం పోలీసులు వేధింపులకు దిగుతున్నారని చెప్పారు. సాయినాథ్‌శర్మతోపాటు ఆయన కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం, కిడ్నాప్ తదితర కేసులు పాత తేదీలతో నమోదు చేశారన్నారు. అధికార పార్టీ నాయకులను సంతప్తి పరచడానికి పోలీసులు శ్రమిస్తున్న తీరు ప్రజలను విస్మయపరుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న అధికారులపై కోర్టును ఆశ్రయించి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.