‘పారిస్ ఒలింపిక్స్ మంచి అనుభవం ఇచ్చింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించే దిశగా సాధన చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని విశాఖ నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ఎర్రాజీ జ్యోతి తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద మీడియాతో జ్యోతి మాట్లాడుతూ... ‘ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి అథ్లెట్‌గా గుర్తింపు రావడంతో కొంత ఒత్తిడికి గురయ్యాను.దీనికితోడు హీట్స్ ముందు రోజు వరకు గాయం కొంత ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ క్వాలిఫై కావాలని రౌండ్-1లో పట్టుదలతో పరుగు తీసినా ఆశించిన ఫలితం సాధించలేకపోయా. ఉద్దండులైన అథ్లెట్లతో పోటీపడడంతోపాటు ఒలింపిక్స్ వంటి అతి పెద్ద ట్రాక్ అండ్ ఫీల్డ్‌పై రేస్‌లో పాల్గొనడం మంచి అనుభవాన్నిచ్చింది.