అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్‌లో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సీఎం అధికారులను అక్కడకు పంపారని తెలిపారు. సంబంధిత అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. 35మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ప్రమాదాలతో పాఠాలు నేర్చుకుని మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలను ప్రధాని ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు స్వయంగా అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతున్నారని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.